గ్రేటర్ హైదరాబాద్‌లో కాషాయ దందాలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. మావాళ్లు కడిగిన ముత్యాలు..దేశం కోసం..ధర్మం కోసం పని చేసే నిజమైన ప్రజా సేవకులు…అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తారు అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెగ నీతులు వల్లె వేశారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత బండి మాటలన్నీ అబద్ధాలని తేలిపోయాయి. ఎన్నికలలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకారం చేసి పట్టుమని 15 రోజులు కూడా కాకముందే డివిజన్లలో దందాలు మొదలుపెట్టారని, అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఓ చిన్న షాప్ పెట్టుకుని డాక్యుమెంట్లు అమ్ముకుంటూ.. జీవనం సాగించే ఓ మహిళపై బీజేపీ కార్పొరేటర్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ షాపు నుంచి ఆమెను ఎలాగైనా ఖాళీ చేయించి తమకు కావల్సిన వారికి కట్టబెట్టాలని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఫిక్స్ అయిపోయారు. వెంటనే ఆమె అనుచరులు రంగంలోకి దిగి గత కొద్ది రోజులుగా ఆ షాప్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని సదరు మహిళను బెదిరిస్తున్నారు. తనకు జీవనాధారమైన ఆ షాపును ఖాళీ చేయనని, తన పొట్టకొట్టవద్దని ఆమె వేడుకున్నా బీజేపీ కార్పొరేటర్ అనుచరులు విన్లేదు. ఈ క్రమంలో సోమవారం సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి రంజన్ అనుచరులు వీరంగం సృష్టించారు.
డాకుమెంట్స్ అమ్ముకునే మహిళపై దౌర్జన్యానికి దిగారు. షాప్‌ని వెంటనే తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. లేదంటే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీంతో భయపడిన సదరు మహిళ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తనను వేధిస్తున్న బీజేపీ కార్పొరేటర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరుతున్నారు. సరూర్‌నగర్ బీజేపీ కార్పొరేటర్ అనుచరుల దందాలపై ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాక్యుమెంట్లు అమ్ముకుని జీవనం సాగించే మహిళపై దౌర్జన్యం చేయడం ఏంటీ..ఆమె షాపును ఖాళీ చేయమని బెదిరించడం ఏంటీ..మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా బూతులు తిట్టడం ఏంటీ.. పొద్దున లేస్తే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు దేశం కోసం..ధర్మం కోసం అంటూ నీతులు మాట్లాడుతారు..ఇదేనా దేశం కోసం..ధర్మం కోసం అంటూ..ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ.. సరూర్‌నగర్ ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ప్రజలారా… కాషాయదందాలు మొదలయ్యాయి..బీజేపీ కార్పొరేటర్లతో తస్మాత్ జాగ్రత్త.