ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బీహార్లోని వైశాలి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో గంగానదిపై నిర్మించిన భారీ బ్రిడ్జిను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.
మే నెలలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. బీహార్లో తొలిసారిగా బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో వైశాలి, పాట్నా జిల్లాల్లో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై నిర్ణీత సమయాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఆరు లైన్ల బ్రిడ్జిని 9.76 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. వైశాలి జిల్లాలోని బిదుపూర్ ప్రాంతాన్ని పాట్నా శివార్లలోని కచ్చీ దర్గాతో అనుసంధానిస్తూ ఈ వంతెనను నిర్మించారు. మాజీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరగడంతో ఆయన గౌరవార్థం దీనికి ‘నితీశ్ సేతు’గా పేరు పెట్టారు.శనివారం ప్రధాని మోదీ తొలుత ఈ వంతెనను సందర్శిస్తారు.
Also Read:హనుమాన్ అన్ష్ హిట్ కానీ..దర్శకుడు మాత్రం!

