100 రోజులైన ముగియని పార్లమెంట్ సమావేశాలు

1
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి నెలలు గడుస్తున్నా.. అధికారికంగా మాత్రం ఇంకా ముగింపు పలకలేదు. లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేసి 100 రోజులు పూర్తయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమావేశాలను అధికారికంగా ప్రోరోగ్ చేయలేదు. దీంతో పార్లమెంటరీ చరిత్రలో ఇదొక కొత్త రికార్డుగా నిలిచింది. మరోవైపు మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా వేశాయి. అయితే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం (Adjournment Sine Die) వేరు… అధికారికంగా ప్రోరోగ్ చేయడం వేరు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పార్లమెంట్ సమావేశాలకు అధికారికంగా ముగింపు పలకడాన్ని ప్రోరోగేషన్ అంటారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వర్షాకాల సమావేశాలు సాంకేతికంగా కొనసాగుతున్నట్లుగానే ఉన్నాయి.

పార్లమెంట్ సమావేశాలు ప్రోరోగ్ కాకుండా అత్యధిక కాలం కొనసాగిన గత రికార్డు 2008లో నమోదైంది. అప్పట్లో 87 రోజుల పాటు సమావేశాలకు అధికారిక ముగింపు పలకలేదు. అయితే ప్రస్తుత వర్షాకాల సమావేశాలు 100 రోజుల పాటు ప్రోరోగ్ కాకపోవడంతో ఆ రికార్డు చెరిగిపోయింది.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణను తీసుకురావాలనే ప్రతిపాదనపై కేంద్రం దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రత్యేక సమావేశాల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన తదుపరి అడుగులు ఏమిటి? అన్నది వేచి చూడాలి.

Also Read:హనుమాన్ అన్ష్‌ హిట్ కానీ..దర్శకుడు మాత్రం!

- Advertisement -