ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆయన వెంట ఉన్నారు. ఇటలీలోని రోమ్‌లో జరిగే 16వ జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయ్యారు.
షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు జరగాల్సి ఉన్నా, గంట పాటు కొనసాగింది. ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఇరువురి భేటీ జరిగింది. వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. భారత్ లో పర్యటించాలంటూ పోప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్ ఇండోనేషియా ప్రధాన మంత్రి జోకో విడొడొలను కలుసుకుంటారు. వారిద్దరితో పాటు సింగపూర్ ప్రధానమంత్రి లీ హొసెయిన్ను కూడా కలుసుకోవాల్సి ఉంది. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదని సమాచారం. ఈ సాయంత్రానికి ప్రధాని టెర్మె డి డయోక్లెజియానో పోడియానికి చేరుకుంటారు.