అంతా కాంగ్రెస్ వల్లే..ఉపన్యాసాలు వద్దు

173
PM Narendra Modi attacks Congress
- Advertisement -

లోక్ సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్ విభజించిన తీరు వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయని మండిపడ్డారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మేం మద్దతు పలికామని చెప్పుకొచ్చిన మోడీ.. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారని దుయ్యబట్టారు.  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చేసిన రాజకీయ అరాచకాలు అనేకం. అలాంటివారా ఆ రాష్ట్రం గురించి మాట్లాడేది. కర్ణాటక ఎన్నికలు లేకుంటే ఆంధ్రప్రదేశ్‌ విభజన గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడేవారా? అని మోడీ అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు.

అయితే మోడీ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ ప్రసంగం ఎప్పట్లాగానే ఉందని, అందులో కొత్తదనమేమీ లేదని ఎద్దేవా చేశారు సోనియా. యువతకు ఉపాధి అవకాశాల గురించి మోదీ ప్రస్తావించలేదని అన్నారు. తమ భవిష్యత్తుపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. దేశ ప్రజలు ఉపాధిని కోరుకుంటున్నారని… ఇలాంటి ఉపన్యాసాలకు కాదని సెటైర్ వేశారు.

తమకు ప్రసంగాలు వద్దని… ఉద్యోగాలు కావాలని ఎఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కోరారు. విపక్షాల ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేదని దుయ్యబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. యువకులు, రైతుల గురించి ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ప్రధానిది పూర్తిగా రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు.

- Advertisement -