భారత్ ‘ఆత్మనిర్భర్’ సాధించాలంటే ఇతర దేశాలపై ఆధారపడటం సరికాదని, దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) కొనసాగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ, ప్రపంచంలో అస్థిరతలు ఉన్న ప్రస్తుత సమయంలో స్వయం సమృద్ధి ఎంతో కీలకమని అన్నారు.
ఇంధన భద్రత అనేది ప్రస్తుత కాలపు అత్యంత ముఖ్యమైన అవసరం. 2047 నాటికి 100 గిగావాట్ల (GW) అణువిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ దశాబ్దంలోనే 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను ప్రారంభించడమే మా లక్ష్యం అని ప్రకటించారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన విధానాలలో మార్పులు తీసుకువచ్చిందని, చమురు, సహజవాయువుల కోసం తీరప్రాంత అన్వేషణలను విస్తరించామని తెలిపారు.
లభ్యమయ్యే కొత్త వనరులను గుర్తించేందుకు లోతైన సముద్రంలో ముమ్మరంగా శోధిస్తున్నామని తెలిపారు. దీనికోసం గతంలో ప్రకటించిన ‘సముద్ర మంథన్’ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ఇటీవల రూ. 85,000 కోట్లు కేటాయించినట్లు మోదీ వివరించారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రారంభమైన సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు వ్యాప్తి చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) మరియు ఎరువులకు కొరత ఏర్పడుతుందని ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఎలాంటి పెట్రోల్, గ్యాస్ లేదా యూరియా కొరత రాలేదని స్పష్టం చేశారు.
Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ
అలాగే తమ ప్రభుత్వ కృషి వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700 పైగా నగరాల్లో గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. మనం ఇతరులపై ఆధారపడి జీవించకూడదు. మన స్వంత సామర్థ్యాలను పెంచుకుని, మన ప్రయోజనాలను మేమే కాపాడుకోవాలి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘లోకల్ ఫర్ లోకల్’ వంటి కార్యక్రమాలతో ప్రతి భారతీయుడు అనుసంధానమవుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం అని ప్రధాని తెలిపారు.

