ప్రధానమంత్రి పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నారు. దీంతో ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ఇది ప్రధాని భద్రతలో పెద్ద లోపం.
ప్రధానమంత్రి షెడ్యూల్ మరియు ప్రయాణ ప్రణాళిక పంజాబ్ ప్రభుత్వానికి చాలా ముందుగానే తెలిపారు. ప్రక్రియ ప్రకారం, రాష్ట్రప్రభుత్వం లాజిస్టిక్స్, భద్రత కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు ఆకస్మిక ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలి….ఆకస్మిక ప్రణాళిక దృష్ట్యా, పంజాబ్ ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని సురక్షితంగా ఉంచడానికి అదనపు భద్రతను మోహరించవలసి ఉంటుందని చెప్పారు.
ఈ భద్రతా లోపం తర్వాత, తిరిగి బటిండా విమానాశ్రయానికి వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకోగా తీవ్రమైన భద్రతా లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరింది. ఈ లోపానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ.