నూతన సంస్కరణలతో రైతులకు కొత్త మార్కెట్లు లభిస్తాయని, వారికి ఆప్షన్లు కూడా పెరుగుతాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశంలో మాట్లాడిన మోదీ… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు తెలిపారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ….వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల మధ్య ఉన్న అవరోధాలను కొత్త వ్యవసాయ చట్టాలు రూపుమాపనున్నట్లు ప్రధాని చెప్పారు.
ఫిబ్రవరి-మార్చిలో కోవిడ్19 మహమ్మారి మొదలైనప్పుడు, ఓ తెలియని శత్రువుతో మనం పోరాడామని, అన్ని రంగాల్లో అనిశ్చితి నెలకొందన్నారు. ప్రొడక్షన్, లాజిస్టిక్స్, ఆర్థిక వ్యవస్థతో పాటు అనేక అంశాల్లో సమస్యలు ఉండేవని ఎన్నాళ్లు ఈ సమస్యలు ఉంటాయని, పరిస్థితులు ఎలా మారుతాయన్న ఆలోచనలు ఉండేవన్నారు. కోవిడ్19 నుంచి దేశం త్వరితగతిన కోలుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు.