‘మందులతో పాటు జాగ్రత్తలూ’.. ఇదే 2021 నినాదం: ప్రధాని

137
modi
- Advertisement -

మందు లేనప్పుడు అలసత్వం వద్దని తాను గతంలో చెప్పానని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మందుతో పాటు జాగ్రత్తగా ఉండాలన్నది కొత్త సంవత్సరం నినాదమని అన్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం భారత్ సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో ఎయిమ్స్ భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరాది సందర్భంగా కరోనా కష్టకాలంలో ముందుండి నడిచిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఫార్మాసిస్టులు, అధికారులు, ఇతర కరోనా యోధులను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కరోనా జాగ్రత్తలను పాటించడం మరవొద్దని, కరోనా కట్టడి కాడి వదిలేయొద్దని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

‘మందులు లేనంత మాత్రాన.. ఢీలా పడిపోవద్దు’ అంటూ ఇంతకు ముందు చెప్పానని, కానీ, ఇప్పుడు మందులూ ఉన్నాయని, దాంతో పాటు జాగ్రత్తలూ తీసుకోవాలని చెబుతున్నానని అన్నారు. ‘మందులతో పాటు జాగ్రత్తలూ’.. ఇదే 2021కి మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ వ్యవహారం తుది అంకానికి చేరిందన్నారు. మన దేశంలో తయారు చేసిన టీకాలనే ముందుగా ప్రజలకు ఇస్తామన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, కొత్త ఏడాది నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నామని ప్రధాని చెప్పారు. కరోనాతో పోరులో లక్షలాది మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఎనలేని సేవలు అందించారన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని 2020 మనందరికీ మరోసారి నేర్పిందని గుర్తు చేశారు. పాత ఏడాది మొత్తం సవాళ్లతో కూడుకున్నదేనని, అలాంటి సంవత్సరానికి కొత్త ఎయిమ్స్ తో వీడ్కోలు చెబుతున్నానని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.30 వేల కోట్ల విలువైన ప్రజా ధనం ఆదా అయిందన్నారు. దేశ వ్యాప్తంగా 7 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా 90 శాతం తక్కువ ధరలకే పేద ప్రజలకు మందులు అందిస్తున్నామన్నారు. దాదాపు మూడున్నర లక్షల మంది పేద ప్రజలు వీటి సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఆరేళ్లలో 10 కొత్త ఎయిమ్స్ లను కేటాయించామని, అందులో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులనూ దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్నామన్నారు. 2022 జూన్ జులై నాటికి ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

- Advertisement -