రజతం సాధించిన భవీనాకు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు..

199
- Advertisement -

టోక్యో పారాలింపిక్స్ లో భారత్‌కు పతకాన్ని అందించి, చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో మ‌న‌కు పతకం రావ‌డం ఇదే తొలిసారి. భవీనాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందించారు.

టోక్యో పారాలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ్ సాధించి భవీనాబెన్‌ పటెల్ దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింద‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్ర‌శంసించారు. ఆమె నిబద్ధ‌త, నైపుణ్యాల వ‌ల్ల దేశానికి మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఇటువంటి గొప్ప విజ‌యాన్ని సాధించిన ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు.

భ‌వీనా ప‌టేల్ చ‌రిత్ర లిఖించింద‌ని, ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తివంత‌మైంద‌ని ప్రధాని మోదీ అభినందించారు.. ఆమె జీవిన ప్ర‌యాణం దేశంలోని యువ‌త‌ను క్రీడ వైపున‌కు ఆక‌ర్షిస్తోంద‌ని తెలిపారు. భవీనా బెన్‌ పటేల్ కు రాజ‌కీయ, క్రీడా ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఆమె సాధించిన విజ‌యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆమె మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.

అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా భవీనాను అభినందించారు..‘టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విట్టర్‌ ద్వారా పొగిడారు.

- Advertisement -