సోమవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి భారత్ తనను కాపాడుకున్న తీరు అమోఘమని యావత్ ప్రపంచం భావిస్తోందని, అందుకు రాష్ట్రాల చిత్తశుద్ధే కారణమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ గాడినపెట్టడంతో పాటు కరోనా కట్టడికి దిశగా అడుగులు వేయాలని మోదీ అన్నారు. ఇందుకోసం సమతుల వ్యూహాన్ని రూపొందించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశంలో కరోనా కట్టడిలో రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషించాయని తెలిపారు. “ఇవాళ మీరు అందించే సూచనల ఆధారంగానే మన దేశం పయనించాల్సిన దిశను నిర్ణయించుకుందాం. అయితే సడలింపుల నేపథ్యంలో కరోనా మహమ్మారి గ్రామాలకు విస్తరించకుండా చూడడమే మనముందున్న అతి పెద్ద సవాలు. భౌతికదూరం పాటించడాన్ని ఎప్పుడు విస్మరిస్తామో అప్పుడే మన సమస్యలు మరింతగా పెరుగుతాయి” అని మోదీ వ్యాఖ్యలు చేశారు.