నేడు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. అందులో లాక్‌డౌన్ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గత 1.5 నెలల్లో దేశం వేలాది మంది ప్రాణాలను రక్షించగలిగిందని చెప్పారు. మన లక్ష్యం వేగంగా స్పందించాలి, దో గజ్దూరి అనే మంత్రాన్ని పాటిస్తున్నామన్నారు ప్రధాని.కరోనాతో పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. రానున్న నెలల్లో కరోనావైరస్ ప్రభావం కనిపిస్తుంది. మాస్క్ లు, ఫేస్ కవర్లు మన జీవితంలో భాగం అయిపోతాయని ప్రధాని మోదీ అన్నారు.
మార్చి ప్రారంభంలో భారత్‌తో సహా పలు దేశాల పరిస్థితి దాదాపుగా ఒకే విధంగా ఉంది. సకాలంలో తీసుకున్న చర్యల వల్ల భారతదేశం చాలా మందిని రక్షించగలిగింది. దేశం ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను చూసింది. రెండూ లాక్ డౌన్ లు కొన్ని అంశాలలో భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుకు వెళ్లే మార్గం గురించి ఆలోచించాల్సి ఉందని ప్రధాని తెలిపారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనావైరస్ ప్రభావం రాబోయే నెలల్లో కనిపిస్తుంది. వీలైనంతగా సాంకేతిక పరిజ్ఞానం వాడాలని ప్రధాని సూచించారు.సంస్కరణలకు సమయాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఎక్కువ మంది ఆరోగ్యసేతు యాప్ ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు చెప్పారు.కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి పరిశోధనతో పాటు ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి విశ్వవిద్యాలయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఏకీకృతం చేయాలన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో ఖచ్చితంగా రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా, తరువాత గ్రీన్ జోన్లుగా మార్చడానికి రాష్ట్రాల ప్రయత్నాలు చేయాలని పీఎం సూచించారు. విదేశాలలో ఉన్న భారతీయులు అసౌకర్యానికి గురికావడం లేదన్న ప్రధాని వారి కుటుంబాలు ఎటువంటి ప్రమాదంలో లేవు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవలన్నారు.
వాతావరణంలో మార్పులు, వేసవి, రుతుపవనాల ఆగమనంపై అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్లో రాబోయే అనారోగ్యాల పట్ల వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు. ఎక్కువమంది ప్రాణాలు కాపాడటానికి లాక్‌డౌన్ అమలు చేయవలసిన అవసరాన్ని ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కరోనా కట్టడి, సంక్షోభ కాలంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ముఖ్యమంత్రులు ప్రశంసించారు.
అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత పెంచే మార్గాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో చర్చించారు.కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పోలీసులు, వైద్య సిబ్బంది కృషికి ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.