ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘సేవా యాత్ర’లో పాల్గొంటున్న వారితో ముఖాముఖి సంభాషించారు.వద్‌నగర్ నుండి వారణాసి వరకు 10 బృందాలుగా ఈ సేవా యాత్రికులు బైక్ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు, సేవా కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, సామాజిక సంక్షేమం, సాంస్కృతిక అనుబంధం మరియు ప్రజా సమీకరణను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ సందర్భంగా యాత్రికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఒక ప్రాచీన సామెతను గుర్తుచేసుకుంటూ, ఎవరైనా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు వారికి నమస్కరిస్తే, ఆ యాత్ర ద్వారా వచ్చిన పుణ్యంలో సగం నమస్కరించిన వారికి దక్కుతుందని చెప్పారు.
“ఈ రోజు ఈ ‘సేవా యాత్రికులందరికీ’ నమస్కరించడం ద్వారా, నేను కూడా ఆ యాత్ర పుణ్యంలో సగాన్ని పొందుతున్నాను,” అని ప్రధాని అన్నారు.సేవా యాత్రికులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, సేవ మాత్రమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని ప్రధాని కోరారు.సేవే మన ప్రాథమిక లక్ష్యం కావాలి. కేవలం ఉపదేశాలు ఇవ్వడం ద్వారా కాకుండా, చేతల ద్వారా సేవా సందేశాన్ని అందించాలి. మన మాటల కంటే చేతలే మన సేవా భావాన్ని నిరూపించాలి అని ఆయన స్పష్టం చేశారు.
మనం ఎంతటి రాజకీయ ಅಧಿಕారాన్ని సాధించినప్పటికీ, మన మార్గం ఎప్పుడూ సేవా మార్గమేనని ప్రజలకు మన ప్రవర్తన ద్వారా చూపించాలని ప్రధాని పేర్కొన్నారు. మనం ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా, ‘సేవయే పరమో ధర్మం’ అనే సూత్రంతోనే ముందుకు సాగుతాము అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Also Read:ఆ బ్యాంకులు ఆదివారం ఓపెన్!
20 టీమ్‌లుగా ఏర్పడి ‘సేవ’ అనే ఒకే సంకల్పంతో మొత్తం 35,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు వద్‌నగర్ నుండి వారణాసికి, వారణాసి నుండి వద్‌నగర్‌కు ఈ బృందాలు ప్రయాణిస్తాయి. ఇది కేవలం మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాకుండా, పట్టణాలు, జిల్లాలు, తాలూకాలు మరియు గ్రామాల్లో ఆగుతూ ప్రజలను కలుసుకుంటారు. చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, పార్కులు, ఆసుపత్రుల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు, యువజన సదస్సులు, గ్రామసభల నిర్వహణ, గోసేవ మరియు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

