యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన మూడు రోజుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని…సెప్టెంబర్ 27, 2026 ఆదివారం రోజున అన్ని ప్రభుత్వ రంగా బ్యాంకులు (PSBs) మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) యథావిధిగా పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. పౌరుల బ్యాంకింగ్ అవసరాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
సెప్టెంబర్ 26, 27 తేదీలలో సాధారణ సెలవు దినాలు రావడం, ఆ వెంటనే సెప్టెంబర్ 28 నుండి 30 వరకు 3 రోజుల సమ్మె ప్రతిపాదన ఉండటంతో ఇది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు సుదీర్ఘకాలం పాటు బ్యాంకింగ్ ಸೇవల ఇబ్బంది కలగకుండా చూసేందుకు సెప్టెంబర్ 27న అన్ని బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం ఆధారిత శాఖలు మరియు కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది.
“ప్రజల అత్యవసర బ్యాంకింగ్ అవసరాలు దీర్ఘకాలం పాటు ప్రభావితం కాకుండా ఉండేందుకు, 2026 సెప్టెంబర్ 27 ఆదివారం రోజున అన్ని ప్రభుత్వ రంగా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ రోజులాగే పనిచేస్తాయి” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
బ్యాంక్ వినియోగదారుల సంక్షేమం మరియు సౌకర్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. సమ్మె పిలుపును విరమించుకోవాలని ప్రభుత్వం మరియు బ్యాంక్ యాజమాన్యాలు యూనియన్లకు విజ్ఞప్తి చేశాయి. నిరంతర బ్యాంకింగ్ సేవలు అందేలా అవసరమైన చర్యలు కూడా చేపట్టినట్లు వెల్లడించాయి. మరోవైపు మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె కొనసాగుతుందని ‘యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ స్పష్టం చేసింది.
బ్యాంకింగ్ రంగంలోని దాదాపు 90 శాతం మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతున్న UFBU, ప్రధానంగా వారానికి 5 రోజుల బ్యాంకింగ్ సిస్టమ్ (5-day banking) అమలుతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతోంది. ఈ సమ్మె గనుక జరిగితే బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల సమ్మె సమయం బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు (Half-Yearly Closing – సెప్టెంబర్ 30)తో కూడుకుని ఉండటంతో ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్లు, ట్రెజరీ కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
Also Read:Kaaka:సెట్లో మెగా వేడుకలు..
ఈ నేపథ్యంలో సమ్మె అమలైతే వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్లు మరియు యూపీఐ (UPI) వంటి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని పలు ప్రభుత్వ రంగా బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారులకు సూచించాయి.

