ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తున్నారు. దీంతో వారణాసిలో పండుగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న మోదీకి స్వాగతం పలుకుతూ అక్కడి ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు. తన కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. మూడేళ్ల వ్యవధిలో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారం ఆయన ప్రారంభించారు. పెద్దఎత్తున సాధులు, సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు కాశీ గంగా నదిలో మోదీ పుణ్యస్నానం ఆచరించారు. గంగా నదిలో కలశంతో పుష్పాలు వదిలారు. కాశీ విశ్వనాథ్ ధామ్ తోపాటు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరపనున్నారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పర్యటన, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.