యూపీ ఓటర్ల జాబితాలో భారీ అక్రమాలు..

3
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తీవ్ర వివాదం నెలకొంది. పిలిభీత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల వివరాల మార్పులకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మొత్తం 10,470 ఓటర్ల వివరాల్లో అక్రమాలు గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎన్నికల నమోదు అధికారులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు ఓ కంప్యూటర్ ఆపరేటర్ సేవలను కూడా రద్దు చేశారు. ఈ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

పిలిభీత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత ఓటర్ల గుర్తింపు కార్డు నంబర్లు (ఈపీఐసీ) అలాగే ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన పేర్లు మారిపోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఏప్రిల్ 10న తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఈ మార్పులు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

మే 31 నుంచి ఆగస్టు 29 వరకు కంప్యూటర్ అసిస్టెంట్ 13,779 ఫారం-8 దరఖాస్తులను నమోదు చేసినట్లు విచారణలో గుర్తించారు. అయితే వీటికి సంబంధించిన భౌతిక దరఖాస్తులు, ఇతర ఆధార పత్రాలు కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల్లో 10,470 సవరణలకు ఆమోదం లభించగా వాటన్నింటిలోనూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:కిరణ్ అబ్బవరం..’భజ గోవిందం’

న్యాయవాది ఫైజాన్ అలీ ఖాన్ తనతోపాటు తన సోదరుడు ఫర్హాన్ పేర్ల విషయంలోనూ తప్పులు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ ఓటరు గుర్తింపు నంబర్లను పరిశీలించినప్పుడు ఇతర పేర్లు కనిపించాయని ఆరోపించారు. ఈ మార్పుల వల్ల అర్హులైన ఓటర్లు ఎన్నికల సమయంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పిలిభీత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ గంగ్వార్ సుమారు 6,930 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో ఓటర్ల వివరాల్లో అక్రమాలు వెలుగుచూడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -