రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ సేవలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను కోరారు. ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలకు కీలకమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలపై పరిమితుల కారణంగా ఆ దేశ సైనిక దళాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. స్టార్‌లింక్ సేవలపై ఆంక్షలను తొలగించాలని ట్రంప్, మస్క్‌కు ఫోన్ చేసి కోరారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు సాధారణ స్థితికి దగ్గరగా పనిచేయడం ప్రారంభించినట్లు అమెరికా, ఉక్రెయిన్ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం యుద్ధరంగ సమాచార మార్పిడి, డ్రోన్ల నిర్వహణ, వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం స్టార్‌లింక్ ఉపగ్రహ సేవలను ఉపయోగిస్తోంది. ఈ సేవలపై వేగ పరిమితులు విధించడంతో రష్యాపై దాడులు చేయడం, రష్యా దాడులను అడ్డుకోవడం వంటి కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురైనట్లు నివేదికలు తెలిపాయి.
Also Read:కిరణ్ అబ్బవరం..’భజ గోవిందం’
అయితే స్టార్‌లింక్ సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడలేదని కొందరు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో విధించిన పరిమితులతో పోలిస్తే సేవల వేగం మెరుగుపడినప్పటికీ, పూర్తి స్థాయి పనితీరు ఇంకా అందుబాటులోకి రాలేదని వారు వెల్లడించారు.మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ మాత్రం స్టార్‌లింక్ సేవల వేగం పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడలేదని తెలిపారు. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

