చంద్ర‌బాబుది క్రిమిన‌ల్ మెంటాలిటీ

6
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుది క్రిమినల్ మెంటాలిటీ అని, దిగజారుడు ఆలోచనలతో కూడిన వ్యక్తి చేతుల్లో అధికారం ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి రక్షణ ఉండదని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ గూండాలకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు. పోలీసులనే ఉపయోగించుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.

ఫోర్జరీ సంతకాలతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టినట్లు జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు.

టీడీపీ శ్రేణుల దాడులను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతున్న వైసీపీ మహిళా అభ్యర్థులు, కార్యకర్తలను జగన్ అభినందించారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ, గుండె నిబ్బరంతో పోరాటానికి సిద్ధమైన అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నానని తెలిపారు. దాడులు, బెదిరింపులు ఎదురైనా సహనంతో నిలబడుతున్న పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, న్యాయ విభాగం సభ్యుల ధైర్యాన్ని ప్రశంసించారు.

ప్రజల ఆస్తుల భద్రతపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని, రేపు పోలీసుల సమక్షంలోనే ఆస్తుల పత్రాలను లాక్కొని చింపేసి, ఆస్తులు తమవేనని చెప్పే పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు. ప్రజలు తమ హక్కులను, ఆస్తులను కాపాడుకునేందుకు అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -