తమిళ రాజకీయాల్లో దూసుకుపోతున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్‌కి జంతు సంరక్షణ సంస్థ పెటా (PETA) లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పావురాన్ని ఎగురవేయడంపై పెటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ టీవీకే అభ్యర్థి ఒక తెల్లటి పావురాన్ని విజయ్ చేతికి అందించారు. విజయ్ ఆ పావురాన్ని గాలిలోకి ఎగురవేశారు. అయితే, ఆ పావురం రెక్కలకు టీవీకే పార్టీ జెండా రంగులు వేయడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రాజకీయ ప్రచారాల్లో, ర్యాలీల్లో మూగజీవాలను ఉపయోగించడం పూర్తిగా నిషేధమని పెటా గుర్తుచేసింది.పక్షులపై మానసిక ఒత్తిడి: పావురాలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందని, వాటికి రంగులు పూయడం, బంధించడం వల్ల అవి తీవ్ర ఇబ్బందికి గురవుతాయని పేర్కొంది.
వేలాది మంది జనసమూహం మధ్య అకస్మాత్తుగా పక్షులను ఎగురవేయడం వాటిని గందరగోళానికి, మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని పెటా తన లేఖలో వివరించింది.రాజకీయ ప్రచారాల కోసం మూగజీవాలను ప్రదర్శన వస్తువులుగా వాడటం సమర్థనీయం కాదు. ఇది పక్షుల సహజ సిద్ధమైన జీవనానికి విఘాతం కలిగిస్తుంది అని పెటా ప్రతినిధులు చెప్పారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు విజయ్ చర్యను తప్పుబడుతుండగా, పార్టీ కార్యకర్తలు మాత్రం అది కేవలం శుభసూచకంగా చేసిన పనేనని వాదిస్తున్నారు. ఈ లేఖపై విజయ్ లేదా టీవీకే పార్టీ వర్గాలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

