కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అస్సాం ముఖ్యమంత్రి కుటుంబంపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని గతంలో పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, అస్సాం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కిందటి తీర్పుపై స్టే విధిస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.ఎఫ్ఐఆర్ నమోదైన అస్సాం కోర్టు నుంచే ముందస్తు బెయిల్ కోరవచ్చని పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు సూచించింది.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
ఒకవేళ ఆయన అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ప్రస్తుతం తాము ఇచ్చిన స్టే ఉత్తర్వుల ప్రభావం ఆ దరఖాస్తుపై పడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.కేసు ఎక్కడ నమోదైతే అక్కడి న్యాయపరిధిలోనే ఉపశమనం పొందాలని కోర్టు అభిప్రాయపడింది.

