అప్పట్లో ఒకడిని చంపి జైలుకు వెళ్లాలనుకున్నా..

284
Jana Sena will contest 2019 elections: Pawan Kalyan
Jana Sena will contest 2019 elections: Pawan Kalyan
- Advertisement -

తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒకరిని చంపాలనుకున్నానని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థుల‌తో ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ.. ఆరో తరగతి చదివేటప్పుడు తన అక్కను ఏడిపిస్తున్న ఒకడిని చంపి జైలుకు వెళ్లాలనుకున్నానని అన్నారు.

ఓ విద్యార్థి పెద్దనోట్ల రద్దు అంశంపై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ… దేశంలో కూరుకుపోయిన అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల నిరోధానికి ఇటువంటి నిర్ణ‌యాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. క‌ట్టిన ప‌న్నులతో ప్ర‌భుత్వ ఆదాయం పెరిగి మ‌ళ్లీ అది జ‌నాల‌కే అందితే ఎంతో సంతోష‌మ‌ని చెప్పారు. బ్లాక్ మ‌నీ ప్ర‌క్షాళ‌న రాజ‌కీయ నాయ‌కుల నుంచే జ‌రిగితే బాగుంటుంద‌ని అన్నారు. మ‌నిషి ఆదాయానికి మించిన ఖర్చు కూడా చేయకూడదని సూచించారు.

గాంధీయిజం అంటే త‌న‌కు ఇష్టమేన‌ని, కానీ నిరాహార దీక్ష‌ల‌తో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావని.. అలాగ‌ని ఆవేశ ప‌డ‌డం కూడా స‌మ‌స్య‌లకు ప‌రిష్కారాలు చూప‌వ‌ని వవన్‌ అన్నారు. ఓ ప్ర‌ణాళిక‌తో స‌మ‌గ్రంగా ఆలోచించి ముందుకు వెళ్లాల‌ని సూచించారు. తాను ఇచ్చిన మాట‌పై ఎక్క‌డా త‌గ్గ‌బోన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌తాన‌ని అన్నారు.

తాను కాలేజీ చదువుతున్న సమయంలో పుస్తకాల్లో చదివి తెలుసుకున్న విషయాలకు, బయటి ప్రపంచంలో జరుగుతున్న దానికి ఎంతమాత్రమూ పొంతన ఉండేది కాదని పవన్ కల్యాణ్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒంటరిగా కూర్చుండిపోయేవాడినని, ఒక్కో దశలో సన్యాసంలో చేరిపోయి, అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవాలన్న ఆలోచన మనసును గట్టిగా పట్టుకుని ఉండేదని అన్నారు. తన స్కూల్ క్యాంపస్ లో దేశభక్తి పాటలు పెట్టేవారని, ఆ పాటలు తననెంతో ప్రభావితం చేశాయని అన్నారు. “సోషల్ పుస్తకాల్లో మన ఇల్లు, మన బడి, మన ఊరు అంటూ బాగుండేది, గాంధీగారు అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటూ… సుభాష్ చంద్రబోస్ గారిట్లా అని. వాస్తవానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ అన్యాయానికి, దోపిడీకి గురవుతుండేవాళ్లు. నాకు అర్థమయ్యేది కాదు. అందుకే ఎవరితో మాట్లాడకుండా ఒక్కడినే కూర్చునేవాడినని అన్నారు.

ఓ విద్యార్థిని ‘అనంత‌పురం కోసం మీరు ఏం చేయ‌గ‌ల‌రు?’ అని ప్ర‌శ్నించింది. దీనికి పవన్ కల్యాణ్ స‌మాధానం చెబుతూ… త‌న‌కు పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తన‌కు ఉందని అన్నారు. విద్యార్థులు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కి ఇప్పుడు స‌మాధానం చెప్ప‌లేనని పేర్కొన్నారు. అనంత‌పురంలోని క‌ర‌వు ప్రాంతాల్లో పాద‌యాత్ర చేస్తాన‌ని వెల్ల‌డించారు. అక్క‌డి క‌ర‌వు ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేస్తాన‌ని, ఆ తరువాత అన్ని అంశాల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి పోరాడ‌తాన‌ని చెప్పారు. కరవు ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించాలని అనుకుంటున్నానని అన్నారు.

- Advertisement -