భారీ క్యూలైన్లు.. సరిపడా లేని కరెన్సీ

267
Heavy rush in atms
Heavy rush in atms
- Advertisement -

పెద్దనోట్లను రద్దు తర్వాత తొలిరోజు ఉదయాన్నే తెరుచుకున్న బ్యాంకులు.. రాత్రి 9 గంటల వరకు కూడా పనిచేశాయి. ప్రైవేటు రంగంలోని బ్యాంకులను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచగా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి మాత్రం 9 వరకు పనిచేశాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక గురువారం ఏటీఎంలు తెరుచుకోవడంతో ఉదయం నుండి ఏటీఎం సెంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. దీంతో ముందస్తు చర్యగా అన్ని ఏటీఎం కేంద్రాల్లో డబ్బులేదని బ్యాంకు అధికారులు వినియోగదారులకు సూచించారు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపేందుకు సరిపడా కొత్త కరెన్సీ నోట్ల సరఫరా ఇంకా కాలేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఈ సాయంత్రానికి 20 శాతం ఏటీఎం కేంద్రాలు తెరచుకోవచ్చని, రేపటికి సగం ఏటీఎంలు, సోమవారం నాటికి అన్ని ఏటీఎంలు తెరచుకుంటాయని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రజలు, ఖాతాదారులు హడావుడి పడి తమ విలువైన సమయాన్ని ఏటీఎం కేంద్రాల వద్ద క్యూల్లో నిలబడి వృథా చేసుకోవద్దని సూచించారు. కొత్త నోట్ల ముద్రణ శరవేగంగా సాగుతోందని, ముద్రితమైన నోట్లు ముద్రితమైనట్టు బ్యాంకుల చేతికి బట్వాడా అవుతున్నాయని తెలిపారు. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ కస్టమర్ల క్యూలైన్లు కనిపిస్తుండగా, మధ్యాహ్నం అయినా, తెరచుకున్న ఏటీఎంల సంఖ్య వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెండో రోజు కూడా బ్యాంకుల్లో కస్టమర్ల క్యూ కొనసాగుతోంది.

images

ఇక ఒక్కరికీ రూ.4000 మాత్రమే బ్యాంకు జారీ చేస్తుండగా… రోజువారీ ఖర్చులకు తీసుకునేవాళ్ల దగ్గర్నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు, పెళ్లిళ్ల లాంటి అవసరాల కోసం తీసుకునేవాళ్లు కూడా కొత్త నోట్ల కోసం అల్లాడుతున్నారు. బ్రాంచిలలో క్లర్కులు, క్యాషియర్లు, ఆఫీసర్లు కూడా ప్రత్యేక కౌంటర్లలో కూర్చుని.. కనీసం భోజనాలకు కూడా లేవలేని పరిస్థితుల్లో పనిచేసినట్లు తెలిసింది. వాళ్లు అంతలా పనిచేసినా, సగటున ఒక్కో కస్టమర్ ఐదు నుంచి ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని అంటున్నారు.

రెండు గంటల్లో 5 కోట్లు

ఇక పెద్ద నోట్ల రద్దు వ్యవహారం జీహెచ్ఎంసీకి బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, పంచాయతీల లాంటి స్థానిక సంస్థల్లో బకాయి ఉన్న ఆస్తిపన్ను సహా ఏ రకమైన ఫీజులనైనా శుక్రవారం వరకు పాత నోట్లతో చెల్లించవచ్చని ప్రకటన రావడంతో దశ తిరిగింది. ఒక్క జీహెచ్ఎంసీకే.. రెండు గంటల్లో ఐదు కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి.

ఇప్పటివరకు ఆస్తిపన్ను కట్టాల్సిన వాళ్లు ఆ అంశాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోకపోయినా.. చేతిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడం అంత సులభం కాకపోవడంతో కనీసం ఈ అవసరానికైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మొత్తం పన్ను బకాయిలను కట్టేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఈ మొత్తం ఇంకెంత పెరుగుతుందో చూడాల్సి ఉంది.

- Advertisement -