రెండురోజులు విరామం తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘చలోరె చలోరె చల్’ స్టార్ట్ చేశారు. ‘చలోరె చలోరె చల్’ పేరుతో యాత్ర కొనసాగిస్తున్న పవన్ నేడు అనంతపురం చేరుకుని,జనసేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన జనసేన అధ్యక్షుడు..ఎవరికీ తాను తొత్తునుకాదని, సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని, అంశాలను బట్టి మద్దతు ఇస్తానని తెలిపారు. అంతేకాకుండా..కరువు సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారాల కోసం కేసీఆర్, చంద్రబాబులను కలుస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరంటూ చెప్పుకొచ్చిన ఆయన..రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతాని అన్నారు.
సీమ సమస్యలపై ఓ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని, ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను దూరమని, తానుచేసే పని నచ్చితేనే ఓటువేయమని అడుగుతానని తెలిపారు. కాగా..‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా పవన్ మూడు రోజులు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే.