స్టార్ హీరోల వీరాభిమానులతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. వీరు ఇబ్బంది పెడుతుంది వారిలాంటి ఇతర వీరాభిమానులనే అనే విషయాన్నే వారు మర్చిపోయారేమో..! మరి వీరు ఇతరులను ఇబ్బంది పెడుతుంటే..ఆ స్టార్ హీలకు కొంచెం కూడా పట్టట్లేదా… ? ఈ అనుమానమే ఇతర హీరొల అభిమానులో కూడా మొదలవుతోంది. ఇంతకీ ఆ వీరాభిమానుల హీరోలు ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా..!
ఇక ఇలాంటి వారితో ఎవరైనా పెట్టుకుంటే అంతే సంగతులు.. ముందు వెనుక ఆలోచించకుండా అవతలి వారిపై పడిపోతారు. ఇదే వారి ఇజం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. పవన్ కళ్యాణ్ అభిమానులు.. అల్లు అర్జున్ మీద చూపిస్తున్న వ్యతిరేకత అలాంటిదే అని చెప్పక తప్పదు. దీనంతటికీ కారణం బన్ని చేసిన ఓ కామెంటే. తర్వాత తాను చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్ పై బన్ని వివరణ ఇచ్చినా.. మెగా వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ చేసే అల్లరి మాత్రం తగ్గలేదు. దీంతో వారి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ.. బన్ని హితవు చెప్పే ప్రయత్నం చేసినా పవర్ స్టార్ అభిమానుల్లో మార్పు రాకపోవడం పక్కనపెడితే..ఇంకా ఎక్కువైందనే తెలుస్తోంది. దాంతో ఆగకుండా..బన్ని మీద వ్యతిరేకతను కొనసాగించారు. తాజాగా ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు ఎలా డిజ్ లైక్స్ కొట్టారో కూడా తెలిసిందే.
ఈ క్రమంలో ‘దువ్వాడ జగన్నాథం’ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు కావాల్సిన వాడని కూడా మరిచిపోయారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ను పవన్ కు ఇచ్చిన విషయమూ పక్కనబెట్టేశారు. ఈ వ్యవహారం..తన సినిమా మీద చూపించిన వ్యతిరేకత వల్ల హరీష్ శంకర్ కు కూడా కోపం వచ్చింది. నిప్పులు చిమ్ముతూ.. అనే శ్రీ శ్రీ కవితను కోట్ చేస్తూ దువ్వాడ టీజర్ ను వ్యతిరేకించిన వాళ్లకు పరోక్షంగా చురకలంటించాడు హరీష్. దీంతో పవన్ అభిమానులు మరింతగా రెచ్చిపోయారు.
ఇంకేముందీ..హరీష్ ని కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఐతే పవన్ అభిమానుల్ని కదిపితే..మరింతగా రెచ్చిపోతారని అర్థం చేసుకున్న హరీష్.. రాజీకొచ్చేశాడు. ‘కాటమరాయుడు’ గురించి ఒక పాజిటివ్ ట్వీట్ పెట్టాడు. మిర్రా మిర్రా మీసం పాట గురించి స్పందిస్తూ.. రికార్డులన్నీ పవన్ కైవసం కాబోతున్నాయన్నాడు. దీంతో పవన్ అభిమానులు శాంతించారు. హరీష్ తో భాయి భాయి అంటూ చేతులు కలిపేశారు.
ఆ విధంగా పవన్ అభిమానులతో దోస్తీకి తెరతీశాడు హరీష్. మరి హరీష్ అంటే.. తన తెలివితో వారిని బుట్టలో వేసుకున్నాడు. మరి బన్ని వారిని ఎలా కన్విన్స్ చేస్తాడు..? అసలు వాళ్ళు వినే స్టేజ్ లో ఉన్నారా..? అనేదే ఇప్పుడు ఎవ్వరికీ అర్థంకాని వ్యవహారం. మొత్తానికి…సరదాగా సినిమాలు చూసే రోజులు పోయాయనే చెప్పాలి. సినిమా చూసి ఫ్యాన్స్ అయితే ఫర్వాలేదు. కానీ.. ఫ్యాన్స్ కాస్తా..ఇతర హీరోల ద్వేషులుగా తయారయ్యి.. ముందు వెనక ఆలోచించకుండా ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదని తెలుసుకుంటే బాగుంటుందేమో..!