మహిళలపై అత్యాచారం కేసుల్లో దోషి అయిన డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రాం రహీం సింగ్‌కు పెరోల్ ఇచ్చే విషయంలో డేరా బాబాకు ఎదురుదెబ్బ తగిలింది. డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రాం రహీం సింగ్ ఆశ్రమంలో ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహ్‌తక్‌లో అత్యంత కట్టుదిట్టమైన సునారియా జైలులో గుర్మీత్ శిక్ష అనుభవిస్తున్నాడు.
తన అత్త హృద్రోగంతో బాధపడుతున్నందున ఆమె కుమారుడైన గుర్మిత్ రాం రహీంను చూడాలనుకుంటుందని, ఆయనకు మూడు వారాల పాటు పెరోల్ మంజూరు చేయాలని డేరాబాబా భార్య హర్జిత్ కౌర్ పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ కుల్దీప్ సింగ్ పెరోల్‌పై జైలు అథారిటీ ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు జడ్జి ఆదేశాల మేర సిర్సా సివిల్ సర్జన్ గోవింద్ గుప్తా డేరాబాబా తల్లి నసీబ్ కౌర్ కు వైద్యపరీక్షలు జరిపి, వైద్య నివేదికను సునారియా జైలు సూపరింటెండెంట్ కు పంపించారు. అయితే ఈ నివేదికలో డేరాబాబాకు పెరోల్ ఇచ్చేందుకు కావాల్సినన్ని నిబంధనలు లేవని ఓ జైలు అధికారి వ్యాఖ్యానించారు. దీంతో గుర్మీత్‌ను పెరోల్‌పై బయటకు పంపేందుకు జైలు అధికారులు నిరాకరించారు.
పెరోల్ కావాలంటూ డేరాబాబా చేసిన అభ్యర్థనను జైలు అధికారులు కొట్టివేశారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు చూపారు. అందులో ఒకటి శాంతిభద్రతల సమస్య కాగా, రెండోది గుర్మీత్ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయమని తెలిపారు. ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోందని వైద్యులు చెప్పారని, ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పినట్టు తెలిపారు. కాబట్టి గుర్మీత్‌కు పెరోల్‌ను నిరాకరిస్తున్నట్టు వివరించారు.