హత్య కేసులో దోషిగా డేరా బాబా..

25
Dera chief Ram Rahim

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు..కానీ డేరా బాబా అంటే అందరికీ తెలుసు. భక్తిముసుగులో వందల కోట్లు సంపాదించి… మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన బాబా. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కపెడుతున్న ఈ డేరా బాబాకు మరో బిగ్ షాక్ తగిలింది. 2002లో డేరా సచ్చా సౌధలో ఒక అనుచరుడైన రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో డేరా బాబా హంతకుడేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ మేరకు 2002 జులై 10 నాటి హత్య కేసుపై ఇవాళ తీర్పును వెలువరించింది.

రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ కోర్టు విచారిస్తోంది. అయితే, ఆ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12న శిక్షను విధించనుంది.

కాగా, ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది. బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.