ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమలో చూపినా బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఆ ట్రెండ్‌లో క్రీడాకారుల జీవిత కథలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం సైనా నెహ్వాల్ బయోపిక్. కాగా, సైనా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె జీవితం ఆధారంగా అమోల్ గుప్తే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా టీ-సీరీస్ వారు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని ముందుగా టైటిల్ రోల్‌కి ఎంపిక చేసారు. సైనా పాత్ర కోసం శ్రద్ధా కపూర్ కొన్ని నెలల పాటు శిక్షణ కూడా తీసుకుంది. అయితే శ్రద్దా అనారోగ్యం కారణంగా, తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ కావడంతో శ్రద్దా స్థానంలో పరిణితీ చోప్రాని ఎంపిక చేసారు. ఈ సినిమా కోసం పరిణీతీ చోప్రా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి రెండు గంటలు కోర్టులో కష్టపడుతుందట.
అంతేకాదు సైనా ఆడిన మ్యాచ్‌లను కూడా చూస్తుందట. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను’’ అని పేర్కొన్నారు పరిణీతీ చోప్రా. ఈ ఏడాది చివరిలో చిత్ర షూటింగ్ పూర్తి చేసి, 2020లో సినిమా రిలీజ్ చేయనున్నారు.