ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్తాన్ గూఢచారి (స్పై) నెట్‌వర్క్ ఉనికి బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. భారత నావికాదళం (ఇండియన్ నేవీ) మరియు రక్షణ రంగానికి చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేస్తున్నారనే పక్కా సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు రంగంలోకి దిగారు. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’ పేరుతో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నిర్వహించిన విస్తృత సోదాల్లో భారీ గూఢచర్య ముఠా గుట్టు రట్టయింది.
కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో ఏకంగా 13 మంది నేవీ సిబ్బంది ఉండటం రక్షణ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానితుల ఇళ్లు, కార్యాలయాల నుంచి డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు), రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్పై నెట్‌వర్క్ వ్యవహారంలో ఇప్పటివరకు ఇద్దరు ప్రధాన నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో పనిచేస్తున్న 31 ఏళ్ల నావికుడు ప్రదీప్ ముఖర్జీ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ (PIO) విసిరిన ‘హనీట్రాప్’ వలలో చిక్కాడు. కొన్ని నెలలుగా నావికాదళ రహస్యాలను సదరు మహిళా ఏజెంట్‌కు చేరవేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో తమిళనాడులోని కోయంబత్తూరులో అతడిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
నావికాదళానికి సంబంధించి కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయివరప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి అక్టోబర్ 14 వరకు రిమాండ్ విధించింది.పాకిస్తాన్‌కు చెందిన గూఢచార సంస్థలు హనీట్రాప్ మరియు ఆన్‌లైన్ ఆర్థిక ప్రలోభాల ద్వారా రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నెట్‌వర్క్ మూలాలు ఎంతవరకు విస్తరించాయనే దానిపై కౌంటర్ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Also Read:క్రిశాంక్ అక్రమ అరెస్టుపై కేటీఆర్ ఫైర్

