సికింద్రాబాద్ కోర్టులో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను తలసాని సాయికిరణ్ యాదవ్ కలిశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. క్రిశాంక్ ప్రెస్‌మీట్ నిర్వహించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ఆయనపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
మన్నె క్రిశాంక్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని తలసాని సాయికిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పు లేదని, తాను నిజాయతీపరుడినని భావిస్తే ఆరోపణలపై ఆధారాలతో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెడికవర్ ఆసుపత్రితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో సహా బయటపెట్టండి అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సిరిసిల్ల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దండయాత్రకు వెళ్లినట్లుగా వ్యవహరించారని తలసాని సాయికిరణ్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులతో ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గబోరని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం అన్నారు.
Also Read:ఆ సీఎంలకు తొలి పరీక్ష!
కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల తరఫున ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుందని తలసాని సాయికిరణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

