సొంతింటి కల సాకారం ఇక కష్టమే!

164
own
- Advertisement -

నేటి నుండి కొత్త ఆర్ధిక సంవత్సనం మొదలుకానుండగా రోజురోజుకు పెరుగుతున్న ధరలు,ధరల కట్టడిలో మోడీ సర్కార్ విఫలం కావడంతో పేదవాడి సొంతింటి కల సాకారం ఇక కష్టమే కానుంది. ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్‌ 80EEA కింద ఇస్తున్న పన్ను మినహాయింపు అనేది ఏప్రిల్‌ 1 నుంచి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా మధ్యతరగతి వారిపై ఇంటి కొనుగోలు భారం కానుంది.

సొంతింటి కలే కాదు పలు సంస్థలపై కూడా నేటి నుండి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఎఫెక్ట్ కానున్నాయి. నేటి నుండి పీఎఫ్ ఖాతాపై పన్ను పడనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన (25వ సవరణ) 2021ను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో EPF ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్ను ఉండనుంది. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.

ఇక మెడిసిన్స్‌ ధరలు కూడా పెరగనున్నాయి. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీబయోటిక్స్‌, ఫినోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, అజిత్రోమైసిన్‌, యాంటీ వైరల్‌ వంటి అనేక మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతినెలా మాదిరిగానే ఏప్రిల్‌ 1న గ్యాస్‌ ధరలు తగ్గడం, పెరగడం అనేది జరగనుంది. ఇటీవల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచింది. ఇప్పుడు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక దేశంలో క్రిప్టో ఆస్తుల పన్ను విధానం అమల్లోకి రానుంది. 30 శాతం పన్ను, 1 శాతం TDS వేయనున్నారు. నష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీల్లో వచ్చే లాభాలపై పన్ను చెల్లించాల్సిందే.పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మొదటి మూడు నెలలు రూ.500, ఆ తర్వాత 9 నెలలు రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించాలి. ఐటీ రిటర్నుల్లో తప్పులు జరిగినట్లయితే పన్ను చెల్లింపుదారులు అప్‌డేట్‌ చేసిన రిటర్నును దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండేళ్ల లోపు ఈ వెసులుబాటు ఉంటుంది.

- Advertisement -