పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటర్ల జాబితాతో ముడిపెట్టడంపై మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. SIR డ్రైవ్ సమయంలో ఓటర్ల జాబితా నుండి తొలగించబడినప్పటికీ…వారు అసలైన ఓటర్లే అని, అలాంటి వారికి రేషన్ నిరాకరించడం తగదని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ ప్రయోజనాలను ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసింది. SIR ప్రక్రియలో జాబితా నుండి తొలగించబడిన వారికి ఇప్పుడు రేషన్ మరియు ఇతర ప్రయోజనాలను నిరాకరిస్తోంది. గత ఎన్నికల్లో ఓటరు స్లిప్పులు రానివారు, వలస వెళ్లినవారు లేదా గైర్హాజరైనవారు అని మార్క్ చేయబడిన వారు కూడా ఇందులో ఉన్నారు… కానీ ఈ వర్గాలలోని చాలా మంది నిజమైన ఓటర్లే అని అన్నారు.
రేషన్ లేదా సంక్షేమ పథకాలు పొందడం అనేది ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపైనే ఎందుకు ఆధారపడాలి?, ఓటర్ల జాబితాయే అంతిమ నిర్ణాయకం అయితే ఇక ఆధార్ ప్రమాణీకరణ ఎందుకు? అని నిలదీశారు. లబ్ధిదారులను వడకట్టడానికి ఓటర్ల జాబితాలను ఎందుకు వాడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలు అనేవి ఓటర్లకు ఇచ్చే బహుమతులు కావు…. అవి అర్హులైన పౌరులందరి హక్కు…. ఈ చర్య లబ్ధిదారుల ధృవీకరణలా లేదు, కేవలం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి, పేద ప్రజలను, ముఖ్యంగా మహిళలు, ఎస్సీలు మరియు ముస్లింలను ఇబ్బందులకు గురిచేసేలా ఉంది అన్నారు. ఈ పథకాలన్నీ ప్రిన్స్ సువేందు వ్యక్తిగత దానధర్మాలైనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఇవి ఎవరి సొంతం కావు, ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయి. ప్రతి అర్హుడైన పౌరుడికి ఇవి దక్కడం వారి హక్కు అని ఒవైసీ స్పష్టం చేశారు.
Also Read:కేఎల్ రాహుల్‌కి ఆస్కార్ ఇవ్వాలి!

