ఎమ్మెల్సీ కవిత గారి మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్‌బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేయాలని బీజేపీ దండయాత్ర చేస్తున్నదని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను కూలగొట్టి తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కాషాయపార్టీ కంకణం కట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఈ వ్యవవహారం నచ్చకే ఎన్డీఏ నుంచి బీజేపీ మిత్ర బృందాలన్నీ బయటకు వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎదిరించి మాట్లాడుతున్నందునే అసత్య ఆరోపణలు, దాడులు చేస్తున్నారని మహేశ్ బిగాల మండిపడ్డారు. కావాలనే మునుగోడు ఎన్నిక తెచ్చారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని, గులాబీ అభ్యర్థికే పట్టంగడతారని ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ఎన్నారైలమంతా కీలకంగా పనిచేశామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లోనూ ముందుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకే బీజేపీ నేతలు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. తాము ఎమ్మెల్యే కవిత స్ఫూర్తితోనే పనిచేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నారైలందరం సీఎం వెంటే ఉంటామని అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు. ఈ సమావేవంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు, తదితరులు పాల్గొన్నారు.