బ్లాక్​ ఫంగస్‌ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

62
black fungus

ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. దానిని నోటిఫియాబుల్ వ్యాధిగా గుర్తించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద దానిని ‘ప్రమాదకరమైన జబ్బు’గా గుర్తించాలంటూ.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స, నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలిని ఆదేశించారు.

తాజా ఆదేశాలతో ప్రతి బ్లాక్ ఫంగస్ కేసునూ జిల్లాల అధికారులు ఆరోగ్య శాఖకు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆరోగ్య శాఖకు వెల్లడించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఇప్పటికే రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడులు బ్లాక్ ఫంగస్ ను ఎపిడెమిక్ గా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చాయి. మహారాష్ట్రలో 1,500 మంది దాని బారిన పడగా.. 90 మంది చనిపోయారు. దాని మరణాల రేటు 50 శాతంగా ఉంది.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?
1. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో లేనివారు. స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న డయాబెటిక్‌ పేషెంట్లు, డయాబెటిక్‌ కెటోయాసిడోసిస్‌(అత్యధికంగా కీటోన్లు విడుదల కావడం)తో బాధపడుతున్న వారు.
2. యాంటీ కాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.
3. అధికమొత్తంలో స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న వారు, ముఖ్యంగా దీర్ఘకాలంగా టొకిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ తీసుకుంటున్నవారు
4. ఆక్సిజన్‌ సపోర్టు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లు.

బ్లాక్‌ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి?
1. ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్‌ డిశ్చార్జ్‌ కావడం
2. ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల చుట్టూ చర్మం ఉబ్బడం, కళ్లు ఎర్రబారడం, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటి చూపు కోల్పోతున్నట్లుగా అనిపించడం, కళ్లు తెరవడం, మూయడంలో తీవ్రమైన ఇబ్బంది
3. ముఖం తిమ్మిరిగా అనిపించడం, స్పర్శ కోల్పోతున్న అనుభూతి
4. ఆహారం నమలడంలో ఇబ్బంది, నోరు తెరవలేకపోవడం
5. దంతాలు వదులుకావడం, నోటిలోపలి భాగం ఉబ్బడం

ఏం చేయాలి?
1. పై లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే ఈఎన్‌టీ వైద్యుడిని లేదా కంటి డాక్టరును సంప్రదించాలి. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లాలి. 
2. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న వాళ్లు షుగర్‌ లెవల్స్‌ తప్పక అదుపులో ఉంచాలి.
3. వైద్యుడిని సంప్రదించకుండా స్టెరాయిడ్స్‌, యాంటీ ఫంగల్‌ మందులు అస్సలు వాడకూడదు.
4. డాక్టర్ల సూచన మేరకు పారానాసల్‌, సైనస్‌ టెస్టులు చేయించుకోవడం