నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. హోటళ్లు.. దుకాణాలు.. పెట్రోల్ బంకులు తదితర వాణిజ్య ప్రాంతాల్లో పెద్దనోట్లు తీసుకోకపోవడం.. చిల్లర నోట్లు చాలినంత అందుబాటులో లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ సమస్య టోల్‌ప్లాజాలో పెద్ద దుమారానికే దారితీసింది. రూ.500, రూ.1000 నోట్లను టోల్‌ప్లాజా సిబ్బంది పెద్దనోట్లను తీసుకోకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. మరికొందరు ఏం చేయాలో తెలీక నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు.
ఈ పరిణామాల పట్ల స్పందించిన కేంద్రం నవంబర్ 11 అర్థరాత్రి వరకు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా దేశంలో నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధాని అనూహ్యంగా పెద్దనోట్ల చెలామణిని రద్దుచేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించారు. దీనికనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.