భారతదేశంలో డిజిటల్ భద్రత, ముఖ్యంగా పిల్లలు మరియు యువతపై సోషల్ మీడియా ప్రభావంపై తీవ్ర చర్చ నడుస్తోంది. చిన్న వయసులోనే పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అలవాటు పడటం, సైబర్ బెదిరింపులు , డిజిటల్ అడిక్షన్ మరియు మానసిక ఒత్తిళ్లకు గురవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిపై సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసే లేదా నిషేధించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (DPDP) చట్టం నిబంధనల ప్రకారం, 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవాలంటే లేదా వినియోగించాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి స్పష్టమైన అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.
సోషల్ మీడియా సంస్థలు (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ వంటివి) తమ యూజర్ల వయస్సును సరిగ్గా నిర్ధారించుకునే సమర్థవంతమైన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు తప్పుడు పుట్టిన తేదీలను నమోదు చేసి ఖాతాలు తెరిచే అవకాశాన్ని అడ్డుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.
అపరిమిత స్క్రీన్ టైమ్, అశ్లీల లేదా హింసాత్మక కంటెంట్‌కు గురికావడం, నిద్రలేమి, చదువుపై శ్రద్ధ తగ్గడం వంటి సమస్యల నుండి చిన్న పిల్లలను రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత్ కూడా గమనిస్తోంది.ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కొన్ని అమెరికా రాష్ట్రాల్లో కూడా పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన వయస్సు పరిమితులు మరియు చట్టాలను అమలు చేస్తున్నారు. భారతదేశం కూడా అదే బాటలో వేగంగా అడుగులు వేస్తోంది.
కేవలం వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా, ప్లాట్‌ఫారమ్‌లను పిల్లలకు సురక్షితంగా ఉంచడంలో టెక్ దిగ్గజాలు బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఈ నిబంధనలను పాటించకపోతే భారీగా జరిమానాలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల డేటా గోప్యతకు భంగం కలగకుండా వయస్సును నిర్ధారించడం (Age Verification), వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ (VPN) వినియోగాన్ని అడ్డుకోవడం వంటి సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
Also Read:ఇకపై ఆ పాత్రలు చేయను!

