ఇకపై ఆ పాత్రలు చేయను!

1
- Advertisement -

‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాలో ఓ కీలకమైన సన్నివేశం కోసం నగ్నంగా నటిస్తున్నప్పుడు తనకు కలిగిన భయాలను, సందేహాలను నటి అమలా పాల్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన ఇమేజ్‌పై ఎక్కడ చెడు ముద్ర పడుతుందోనని ఆందోళన చెందానని, ఇప్పుడు అలాంటి పాత్ర వస్తే మళ్లీ చేయనని ఆమె స్పష్టం చేశారు.

2019లో వచ్చిన తమిళ చిత్రం ‘ఆడై’ కోసం తాను తీసుకున్న రిస్క్ గురించి అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ఈ సినిమాను అంగీకరించే ముందు తన ఇమేజ్‌పై ప్రభావం పడుతుందేమోనని భయపడ్డానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోనని ఆమె చెప్పారు. ఈ కథను రచయిత మరియు దర్శకుడు రత్నకుమార్ ఏ విధంగా తెరకెక్కిస్తారు, ఈ నగ్నత్వం కథకి ఉపయోగపడుతుందా లేక విమర్శలకే పరిమితమవుతుందా అన్నది తన ప్రధాన ఆందోళనగా ఉండేదని అమలా పాల్ తెలిపారు. ఈ సినిమాను ఒప్పించేందుకు దాదాపు రెండు నెలల పాటు దర్శకనిర్మాతల విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాతే నటించడానికి అంగీకరించానని వెల్లడించారు.

ఆమె మాట్లాడుతూ.. నాకు దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌పై పూర్తి నమ్మకం కావాల్సి వచ్చింది. వీళ్లు భావోద్వేగపూరితమైన ఒక అద్భుతమైన చిత్రాన్ని తీయాలనుకుంటున్నారా? లేక కేవలం నగ్నత్వాన్నే ప్రధానాంశంగా చూపుతారా? అనేది నా ఆలోచన. వారిపై నమ్మకం కుదిరి, చిత్రీకరణ సృజనాత్మకంగా ఉంటుందని నమ్మకం వచ్చాక, అదొక అందమైన అనుభవంగా మారింది. షూటింగ్ సెట్‌లో అతి తక్కువ మందిని ఉంచి నన్ను ఎంతో కంఫర్ట్‌గా చూసుకున్నారు అని వివరించారు.

సినిమాకు సైన్ చేయడానికి ముందు తనకున్న భయాలను గుర్తుచేసుకుంటూ.. ఆ సమయంలో నా ఇమేజ్ ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. నాపై ఒక టైప్‌కాస్ట్ ముద్ర పడటం, తరచూ ఇలాంటి సినిమాలే రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇప్పుడు మళ్లీ ‘ఆడై’ లాంటి సినిమా చేయమని నన్ను అడిగితే.. కచ్చితంగా నేను చేయననే అనుకుంటున్నాను అని అమలా పాల్ స్పష్టం చేశారు.

Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్‌ టైటిల్

- Advertisement -