బెనిఫిట్‌ షోల్లేవు…

179
- Advertisement -

వెండితెర అద్భుత కావ్యం బాహుబలి-2 చిత్రం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేటి నుంచి టిక్కెట్లు అమ్ముతున్నారు. టికెట్ రేట్ల విషయంలో భారీ బాదుడు జనాల జేబులకు చిల్లులు పెట్టే కార్యక్రమం బాగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను 200 రూపాయలకు పైగా పెంచుకుందామన్న బాహుబలి మేకర్స్ ఆలోచన బెడిసికొట్టింది. బాహుబలి మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సినిమా ధియేటర్లకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. కేవలం ఐదు షోలకు మాత్రమే అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం… బెనిఫిట్ షోలకు మాత్రం కాదని స్పష్టం చేసింది. కాంబో ప్యాక్ పేరుతో మల్టీఫ్లెక్సుల్లో జరిగే దందాపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. అధిక ధరకు టికెట్లను అమ్మితే ఆ థియేటర్లపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఏప్రిల్ 28న విడుదల కావల్సి ఉన్న బాహుబలి 2 సినిమాను బెనిఫిట్ షో పేరుతో ఒకరోజు ముందే అంటే ఏప్రిల్‌ 27న వేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ కూడా జరిగాయి. దీనిపై స్పందించిన సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. బెనిఫిట్ షోలు వేయరాదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వేస్తే థియేటర్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా బాహుబలి 2 మూవీ టికెట్ల ధరను పెంచి అమ్మితే టోల్ ఫ్రీ నంబర్ 1800-4253787 నంబర్ కు కంప్లయింట్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ప్రకటించారు.

- Advertisement -