సీఎంగా మళ్లీ నితీశ్ ప్రమాణస్వీకారం

219
Nitish Kumar Form Government With BJP
- Advertisement -

బీహార్‌లో మహాకూటమి బంధానికి జేడీయు రాంరాం పలికింది. ఎవరు ఉహించని విధంగా….బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు నితీశ్ కుమార్. ఎన్డీఏ మద్దతుతో ఆరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్  కేసరినాథ్ త్రిపాఠి ఆయన చేత ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా….ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సుశీల్ కుమార్ ప్రమాణం చేశారు.

నితీశ్ కుమార్ వ్యూహానికి లాలూ టీం చిత్తయింది. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ని రాజీనామా చేయించాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో.. నితీశ్ ఏకంగా ఆర్జేడీనే బయటికి గెంటేశారు.

నితీశ్ రాజీనామాతో స్పందించిన బీజేపీ ఆయనకు మద్దతిస్తున్నట్లు తెలిపింది. ట్విట్టర్‌లో నితీశ్‌ని ప్రశంసించిన మోడీ…అవినీతిపై పోరులో చేరినందుకు శభాష్ నితీశ్ అంటూ  కితాబిచ్చారు.

బీహార్ లో మొత్తం శాసనసభా స్థానాల సంఖ్య 243 కాగా, ప్రభుత్వం ఏర్పరచాలంటే కావాల్సిన కనీస మెజార్టీ స్థానాల సంఖ్య 122.

* జేడీయూ – 71
* ఆర్జేడీ -80
* బీజేపీ -53
* కాంగ్రెస్ -27
* ఎల్జేపీ -2
* ఇతరులు -10

1951, మార్చి 1న పరమేశ్వరిదేవి, కవిరాజ్‌ రామ్‌లఖన్‌ సింగ్‌ దంపతులకు జన్మించారు నీతీశ్‌కుమార్‌ . వారు కుర్మి (బీసీ) సామాజికవర్గానికి చెందినవారు. రామ్‌లఖన్‌ సింగ్‌ స్వాతంత్య్ర సమరయోధుడు. తండ్రి నుంచి నీతీశ్‌ నైతిక విలువలను నేర్చుకున్నారు. 1973, ఫిబ్రవరి 22న ఉపాధ్యాయురాలైన మంజుకుమారి సిన్హాను నీతీశ్‌ వివాహమాడారు. వీరి ఏకైక సంతానం నిశాంత్‌ కుమార్‌ ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగంలో స్థిరపడ్డారు. మంజుకుమారి అనారోగ్యంతో 2007లో మృతిచెందారు.

ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన నితీశ్‌ సామాజిక కూర్పుతో రాజకీయాల్లో ముద్ర వేశారు. ఓబీసీ, ఈబీసీ, మహాదళితులు, అల్పసంఖ్యాక వర్గాల మద్దతును కూడగట్టి 2005 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. లాలూ-రబ్రీదేవీల 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికారు.

భారతీయ జనతా పార్టీతో దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన నితీశ్‌ అనుబంధం 2013లో తెగిపోయింది. భాజపా లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిగా నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీని ఎంపికచేయటాన్ని నితీశ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్నారు. తర్వాత తన బద్ద శత్రువుగా ఉన్న లాలుతో కలిసి మహాకూటమిని ఏర్పాటుచేసి బీహార్ పీఠాన్ని బీజేపీకి దక్కకుండా చేయడంలో సఫలమయ్యారు. మహాకూటమితో రెండేళ్లపాటు  సాగిన నితీశ్‌ తిరిగి ఎన్డీఏ పంతనే చేరారు.

- Advertisement -