భారత రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నేడు తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. నిజానికి బుధవారమే ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.
ఇక గురువారం ఉదయం సౌత్ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతోపాలు పలువురు నేతలు హాజరయ్యారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తన సీటులో కూర్చున్న నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్షణ శాఖను ఆధునికీకరించడమే తన లక్ష్యమని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీని చేపట్టనున్నట్టు తెలిపారు. సైనిక దళాల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.
ఈ క్రమంలో, రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలను చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. గతంలో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, రక్షణ శాఖను కొంత కాలం పాటు తన వద్దే ఉంచుకున్నారు.