కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మీడియాతో మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత కేంద్ర ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ వృద్దిలోకి వస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. దేశంలో కొవిడ్ ప్రభంజనం తర్వాత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని అన్నారు. అనేక రంగాలు క్రమంగా కుదుటపడుతున్నాయని వివరించారు.
గత నెలలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని తెలిపారు. గతేడాది అక్టోబరు నాటి జీఎస్టీ వసూళ్లతో పోల్చితే ఇది 10 శాతం అధికం అని వెల్లడించారు. ఈ అక్టోబరులో రూ.1.05 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయని, బ్యాంకు రుణాల శాతం పెరిగిందని, ఎఫ్ డీఐల శాతం కూడా 13 శాతం పెరుగుదల నమోదు చేసిందని వివరించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ కార్డులకు పోర్టబులిటీ కల్పిస్తున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. ఇంటర్ స్టేట్ పోర్టబులిటీ వల్ల సుమారు 68.6 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనున్నది.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ పథకం ప్రకటించారు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ జీతంతో ఈపీఎఫ్ఓ నమోదిత సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిని ప్రోత్సహించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే వలస కార్మికుల వివరాలకు సంబంధించిన పోర్టల్ అభివృద్ధి దశలో ఉందని చెప్పారు నిర్మల సీతారామన్.
నిర్మల సీతారామన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు:
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మంచి ఫలితాలనిస్తోంది. 28 రాష్ట్రాల్లు, యూటీల్లో పేదలు వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా 68.8 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.
పీఎం స్వనిధి పథకానికి 26.62 లక్షల మంది వీధి వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. 13.78 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. అందుకోసం రూ.1373.33 కోట్ల నిధులను విడుదల చేశాం.
వలస కార్మికుల వివరాలను తెలిపే పోర్టల్ అభివృద్ధి దశలో ఉంది. అది అందుబాటులోకి వస్తే వలస కార్మికులు ఎక్కడికి పోతున్నారు? ఏం పనిచేస్తున్నారన్న పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరింది.1.83 కోట్ల దరఖాస్తులు రాగా. 1.57 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను బ్యాంకులు మంజూరు చేశాయి. వాటి ద్వారా రెండు దశల్లో 1,34,262 కోట్లు మంజరయ్యాయి.
రైతులకు నాబార్డు ద్వారా అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద 25 వేల కోట్లను మంజూరు చేశాం. మత్ససంపద యోజన పథకం కింద 21 రాష్ట్రాల్లోని మత్స్యకారుకు రూ.1681 కోట్ల నిధులు మంజూరు చేశాం.
ఇక పాక్షిక క్రెడిట్ గ్యారటీ స్కీమ్ 2.0 కింద రూ.26,889 కోట్లు, NBFC/HFCలకు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద రూ.7227 కోట్లు, DISCOMSకి 1,18,273 నిధులను మంజూరు చేశారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు, యూటీలకు రూ.31,136 కోట్లు చేరాయి.