తెలంగాణలో కృష్ణా జలాల వినియోగం, రైతుల పరిస్థితి అంశాలపై రాజకీయ వేడి పెరుగుతోంది. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలే ప్రధాన ఆధారం అయినప్పటికీ, వాటి వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్లు లేకుండానే నీటిని తరలించుకుంటోందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకుండా నిశ్చేష్టంగా చూస్తోందని ఆయన విమర్శించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటిని వినియోగించుకోగా, తెలంగాణ మాత్రం అత్యల్పంగా వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు.
పంటలు కోత దశకు చేరుకున్న ఈ సమయంలో నీటి కొరత రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. “నోటికాడికి వచ్చే బుక్క నేలపాలవుతోంది. రైతుల కష్టార్జితం నాశనం అవుతోంది” అని ఆయన అన్నారు. ముఖ్యంగా నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతూ “గురుదక్షిణ” చెల్లిస్తున్నాడని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నాడా? సర్కస్ నడుపుతున్నాడా?” అంటూ విమర్శించారు.
Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!
ఇంకా, సమస్యను ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని నిరంజన్ రెడ్డి అన్నారు. “కృష్ణా నదిలో నీళ్లు పారుతున్నాయని 45 రోజుల ముందే చెప్పినా, పంపులు ఆన్ చేయలేదు. ఇప్పుడు పంటలు కోత దశలో ఉండగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి” అని ఆయన విమర్శించారు.

