అసెంబ్లీ నిర్వహణపై హరీష్ రావు ఫైర్

14
- Advertisement -

అసెంబ్లీ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా సమస్యలపై చర్చకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, వివిధ కారణాలతో సభ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కేరళ ఎన్నికల కారణంగా ఈ నెల 30వ తేదీన శాసనసభను మూసివేయడం సరైన నిర్ణయం కాదన్నారు. కేరళ రాజకీయాల కంటే తెలంగాణ ప్రజల సమస్యలు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెంబ్లీ సమయం సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

అసెంబ్లీ నిర్వహణలో అనిశ్చితి నెలకొన్నదని ఆయన విమర్శించారు. ఒక రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని, మరొక రోజు కేరళ నుంచి వస్తున్నారని చెప్పి టీ బ్రేక్ పేరిట గంటల కొద్దీ సభను నిలిపివేశారని తెలిపారు. అలాగే వ్యక్తిగత కార్యక్రమాలు, మంత్రుల సన్నాహకాలు వంటి కారణాలతో సభను తరచుగా వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

“మంత్రులు ముందుగా సిద్ధమై సభకు రావాలి గానీ, సభలోకి వచ్చి ప్రిపేర్ అవుతారా?” అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు అందజేయడం వంటి కార్యక్రమాల కోసం కూడా అసెంబ్లీ సమయాన్ని ఉపయోగించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు.

Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!

అదేవిధంగా సభలో సభ్యుల ప్రవర్తనపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సహా కొంతమంది సభ్యులు అనుచిత పదజాలం ఉపయోగిస్తున్నారని, మరికొందరు హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయకపోవడం ఎందుకని ప్రశ్నించారు.ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించిన హరీష్ రావు, అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -