అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైకీ తయారుచేసిన బూట్లు వేలంలో పలికిన ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం. 1972లో ‘మూన్ షూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ అరుదైన స్నీకర్స్‌ను సోథిబే సంస్థ మంగళవారం వేలం వేసింది. ఇందులో ఈ బూట్లు ఏకంగా 4,37,500 డాలర్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3కోట్లకు పైనే ఉంటుంది.
ఈ మూన్ షూస్ ను కెనడాకు చెందిన మైల్స్ నాదల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో 4,37,500 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.3 కోట్లు)కు దక్కించుకున్నాడు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు అని చెప్పవచ్చు..అప్పట్లో నైక్ సహ వ్యవస్థాపకుడు బిల్ బోవర్‌మన్ ఈ డిజైన్‌ను చేశాడు.
అయితే ఈ మోడల్ షూస్ కేవలం 12 జతలు మాత్రమే నైక్ సంస్థ తయారు చేయగా అందులో ఈ జత ఒకటి. 1984లో ఒలింపిక్ బాస్కెట్ బాల్ ఫైనల్స్‌లో మైఖెల్ జోర్డాన్ ధరించిన కాన్‌వర్స్ స్నీకర్స్‌ను 2017లో సోథిబే సంస్థ వేలం వేయగా 1,90,373 డాలర్లకు అమ్ముడయ్యాయి. తాజాగా, ఒలింపిక్ రన్నర్స్ వినియోగించిన ఈ షూస్ రూ.3 కోట్లు పలకడం విశేషం.