నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా పసుపు రైతులను మోసం చేశారన్నారు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి. గెలిచిన 15రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామి ఇచ్చి రైతులను మభ్యపెట్టారన్నారు. ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇచ్చిన హామిల మేరకు రైతులు మలి ఉద్యమానికి సిద్దం అవుతున్నారని చెప్పారు.
నిజామాబాద్ కు పసుపు బోర్డ్ తీసుకువస్తారా లేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి రాష్ట్ర ఎర్పాటు దినాన్ని బ్లాక్ డే గా వర్ణించారు. తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదా అన్నారు.
బయ్యరం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కృషి చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్దికి పాటు పడుతుంటే.. బీజేపీ మాత్రం ఎదో ఒక రకంగా అధికారంలోకి రావడానికి పలు రకాల కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని రకాల కుల, మతాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.