భావన కేసులో మరో ట్విస్ట్..

151

మలయాళ నటి భావనను కిడ్నాప్ చేసి.. కార్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దురాగతానికి పాల్పడిన ప్రధాన నిందితుడు పల్సర్ సునితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు… ఐతే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. తెర వెనుక నిందితుల పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఈ కేసును పోలీసులు నీరుగార్చేస్తున్నట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. భావన సైతం ఇదే తరహాలో మాట్లాడింది ఇంతకుముందు. తాజాగా ఆమె ఓ మలయాళ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఈ కేసు విషయమై ఓ సంచలన విషయం బయటపెట్టింది.

New Twist in Bhavana Molestation Case

పల్సర్ సుని గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి కార్లో తనను వేధిస్తున్న సమయంలో క్రమం తప్పకుండా సునికి ఫోన్ కాల్స్ వచ్చాయని.. అతడికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపించింది ఒక మహిళ అని ఆమె వెల్లడించింది. సుని మాటల్ని బట్టి అవతల ఉన్నది ఒక లేడీ అన్న విషయం స్పష్టంగా తనకు అర్థమైందని భావన తెలిపింది.

ఐతే ఆ మహిళ ఎవరో తాను చెప్పలేకపోతున్నానని.. పోలీసులే ఆ విషయం బయటికి తీయాలని భావన పేర్కొంది. తనపై జరిగిన కుట్ర వెనుక చాలామంది పెద్దల భాగస్వామ్యం ఉందని భావిస్తున్నానని.. ఈ కేసును తాను తేలిగ్గా వదలనని.. ధైర్యంగా పోరాడతానని భావన తెలిపింది. భావన కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆ మహిళ ఎవరా అని ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమ చర్చించుకుంటోంది.