నవ్విపోదురుగాక నాకేంటి.. బండి సంజయ్‌కి నెటిజన్‌ ప్రశ్న..!

551
- Advertisement -

నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అయ్యా బండి సంజయ్ గారు..

“అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట” వెనకటికొకడు. మీరు కరోనాపై పోరులో తెలంగాణకు కేంద్రం సాయం రూ.7151.8 కోట్లు పోస్టర్ చూస్తే ఈ సామేత మీకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. “కుసింత జ్ఞానమున్నోడు కొసంత ఎగురుతే” ఏమైతదో మీ పోస్టర్ కండ్లకు కట్టింది. ఆ పోస్టర్ చూసినంక నవ్వాలో ఏడ్వాలో అర్ధం కానీ పరిస్థితి. గొబెల్స్ గురించి పేపర్లలో వార్తలు చదివినం కానీ ఇప్పుడు మీ రూపంలో చూస్తున్నమేమో అనిపిస్తుంది. లేదంటే మేం కష్టపడితే వచ్చిన చెమట చుక్కలు కూడా మోడి వల్లనే వచ్చినయని చెప్పడమేంటో మీకే తెలియాలి. మీ పోస్టర్ లో మచ్చుకు ఓ మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న.. ఎవరన్న చెప్తే వినో, లేదంటే చూసి, సదువుకొని మార్చుకుంటవో మీ ఇష్టం. కాదు, కూడదు సిగ్గులేనోనికి నవ్వే సింగారమని నవ్వి వదిలేస్తవో మీ ఇష్టానికే వదిలేస్తున్నం.

మీరు చెప్పిన రూ. 1001 కోట్ల డిస్ట్రిక్ మినరల్ ఫండ్ :

ఇప్పటిదాక అబద్ధం వాయు రూపమే కానీ.. మీ వాళ్ల భౌతిక రూపం సంతరించుకున్నది. రాష్ట్రంలో తవ్వితీసే ఖనిజాలు, ఇసుక, బొగ్గు లాంటి వాటిపై రాష్ట్రాలు వసూలు చేసే సెస్ ద్వారా మినరల్ ఫండ్ జమకూడతది. అయితే ఇప్పుడు కష్టమొచ్చిందని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మార్చి ఈ నిధులను కోవిడ్ నివారణ చర్యల కోసం కూడా వాడుకొమ్మన్నది. తెలంగాణను నుంచి వసూలైన వేల కోట్ల రూపాయల్లో ఓ వెయ్యి కోట్లు అన్ని రాష్ట్రాలకు విడుదల చేసినట్టే.. రాష్ట్రానికిచ్చిండ్రు. దీన్ని కేంద్రం ఇచ్చిందని ఎట్ల చెప్తరో మాకర్దం కాలే. మన వాకిట్లకొచ్చిన కోళ్లన్ని మనయే అని కోసుకుతింటమంటే న్యాయమా.? అసలు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో వసుల్ చేసిన సెస్సుకాక ఒక్క రూపాయన్న కలిపి ఇచ్చిందా.? మీ దగ్గర ఆధారాలుంటే ప్రజల ముందట పెడితే మంచిగుంటది. అంతే కాని ఆడినోందే అబద్ధం నమ్మినోనిదే నేరం అంటే ఎట్లా..?

మీరు చెప్పిన రూ. 126.9 కోట్ల భవన నిర్మాణ కార్మికుల ఫండ్ :

ప్రగల్భం అనే మాటకు ప్రాణం ఉంటే మీ మాట విని ఉరేసుకొని చచ్చిపోయేది. రాష్ట్రంలో భవన నిర్మాణాల మీద ప్రభుత్వం తీసుకునే సెస్ ద్వారా ఈ నిధులు సమకూర్చుకుంటది. ఈ నిధుల్ని నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం వినియోగించుకుంటరు. ఇట్లాంటిదాన్ని కూడ మేమే ఇచ్చినమని చెప్పడం కన్నా సిగ్గు ఇంకెమైనా ఉంటదా.? సదువుకున్నోళ్లం కాబట్టి అడుగుతున్నం. ఇదే విషయం తెలంగాణ పల్లెల్లల్ల తెలిస్తే బీజేపీని, నిన్ను కలిపి కడిగేస్తరు. సరే పోస్టర్ కొట్టిచ్చినోనివి.. మీ సొమ్ములు ఇవి.. మేం ఇచ్చే పైసలు ఇవని చెప్తే ఇజ్జత్ దక్కేది కదా.

పిఎఫ్ చెల్లింపులు – మీ పిట్టకథలు :

గోచి ఎక్కడున్నదని అడిగితే.. కట్టిసూపిత్తాగు అన్నట్టుంది మీ యవ్వారం. ఉద్యోగులు రాత్రిపగలు పనిచేస్తే వాళ్ల సంక్షేమం కోసం ఉద్యోగి జీతంలో కొంత, సంస్థ కొంత కలిపి ప్రావిడెంట్ ఫండ్ ను జమచేస్తరు. ఇప్పుడు జీతాల్లో కోతపడుతున్నయని అత్యవసర ఖర్చుల కోసం కొందరు ఉద్యోగులు తమ పైసల్ విత్ డ్రా చేసుకుంటున్నరు. అట్లా రాష్ట్రంలో పనిచేసినవాళ్లు రూ.174 కోట్లు వాళ్ల డబ్బు వాళ్లు విత్ డ్రా చేసుకుంటే.. మేమిచ్చినమని ఎట్ల చెప్పబుద్ధయ్యింది. అందుకు మీ దగ్గర ఏదన్న ఆధారం ఉందా..?

ఫ్రెండ్స్… ఇవి చూసినంక మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెల్వదు కని. నాకైతే ఒకటి అనిపిస్తాంది. రేపు పొద్దుగాల మన అకౌంట్లకెళ్లి మన పైసలు తీసుకున్న బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటయి కాబట్టి ఆ పైసలన్ని మోడీని ఇచ్చిండని వాల్ పోస్టర్లేస్తరేమోననిపిస్తుంది. ప్రజల అభిమానం చూరగొనాలంటే మంచి పనులు చేయాలి.. అంతేకానీ వెకిలి ప్రచారాలు కాదు. ప్రతిసారి ఓడిపోయి పాడైపోతవేమోనని ఓసారి ఓటేసి గెలిపించిన్రు. దాన్ని ఈ అజ్ఞానంతో ఆగం చేసుకుంటే ఎట్లా..? ఎంపీగా ఉన్నప్పుడు ఏ నిధులు ఎవ్వరివి, ఏ నిధులు ఎక్కడినుంచి వస్తయి, ఎవ్వరికి అధికారం ఉంటది. దాని అనుభవదారు ఎవ్వరో తెల్సుకోవాలి కదా.

నీ ఫోటో వేసుకున్నవ్ సరే.. కానీ ప్రధాని ఫోటో వేసుకున్నప్పుడైనా మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తీసివేతలు రాకపోయిన ఫర్వాలేదు గాని.. పురాత్తిగ జమలు కూడా రాకపోతేట్ల. ఊ అంటే ఊగిపోయే పువ్వు తమ్ముల్లైన సూసుకొని సంజయన్నకు సలహా చెప్పాలే కదా. మంది పిలగాండ్లను మన పిలగాండ్లంటే ఇజ్జత్ పోతదనే సూచన చెయ్యాలి కదా. అసలే జనం కరోన కన్ఫ్యూజన్ లో ఉన్నరు. కన్ఫ్యూజన్ లో కెలికితె.. కనెక్షన్ కట్ చేసి సెలక్షన్ షాట్లు ఆడతారని తెల్సుకోవాలి కదా. మన గుర్తు పువ్వుని చేతిలో పట్టుకోవాలి కానీ.. చెవిలో పెట్టుకుంటే ఎట్లా..? సరే, మీ చెవ్వు మీ పువ్వు మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి.. కానీ జనం చెవిలో పెట్టాలని చూస్తే ఎట్లా..? అది దేశ ప్రధాని ఫోటో వేసి. ఇప్పుడు చెప్పినవన్ని సాంపిల్స్ మాత్రమే. ఇంకా మీ డంబాచారం బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటరో ప్లేస్ చూస్కుంటే బెటర్ అని నా అభిప్రాయం. కాదంటే, దమ్ముంటే మేం చెప్పిన పై మూడు విషయాల్లో మీ నిధులుంటే బయటపెట్టండి. మీరు కహానీలు చెప్తే, కచేరీలు చేస్తే చప్పట్లు కొట్టి శాల్వ కప్పడానికి ఇది గుజరాత్ కాదు.. ఉద్దండులను సుస్సుపోయించి స్టేట్ తెచ్చుకున్న తెలంగాణ.

bandi sanjay

- Advertisement -