నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా వరుసగా ఏడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. దడేల్‌ధురా నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి సాగర్ ధకల్‌పై 25,534 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. సోమవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది.
వారం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు దేవ్‌బాకు చెందిన నేపాలీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఖాట్మండులోని మూడు స్థానాలతోపాటు మొత్తం 10 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 46 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మూడు స్థానాలో గెలుపొందగా, 42 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో 275 మంది పార్లమెంటు సభ్యుల్లో 165 మంది ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా, మిగిలిన 110 మందిని దామాషా ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు. మొత్తం 550 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీల్లో 330 మందిని నేరుగా, 220 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..