భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి దాదాపు ఐదు దశాబ్దాలు కావస్తున్న వేళ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని చేర్చింది. భారత ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఈ అత్యవసర పరిస్థితిని పాఠ్యాంశంలో అభివర్ణించారు.
ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా రూపొందించిన ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ అనే పాఠ్యపుస్తకంలో భారత ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లను వివరించే అధ్యాయంలో ఈ అంశాన్ని పొందుపరిచారు.
1975-77 మధ్య కాలంలో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది. 1970ల ప్రారంభంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి ఆరోపణల వల్ల దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో, జూన్ 1975లో అంతర్గత కల్లోలాల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది” అని ఆ విభాగంలో పేర్కొన్నారు.
ఈ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేయడం, పత్రికలపై సెన్సార్‌షిప్ విధించడం, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం వంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని పుస్తకంలో వివరించారు. ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సోషలిస్ట్ మేధావి, ‘లోక్‌నాయక్’ జయప్రకాష్ నారాయణ్ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో విద్యార్థులను, పౌరులను ఆయన ఎలా ఏకం చేశారో వివరించారు. అనంతరం 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేయడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నాటి ప్రభుత్వం ఓడిపోవడం.. భారత ప్రజాస్వామ్య ముఖచిత్రాన్ని, బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని పేర్కొన్నారు.
కేవలం ఎమర్జెన్సీ మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం , ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పేదరికం, ప్రాంతీయవాదం, లింగ వివక్ష వంటి అంశాలను కూడా ఈ అధ్యాయంలో చర్చించారు.దీంతో పాటు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ‘డెమోక్రసీ అండ్ యూ’ అనే సరికొత్త విభాగాన్ని… అలాగే భారతదేశంలో ఓటింగ్ వ్యవస్థకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలను (2024 నాటికి 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు) కూడా ఈ పాఠ్యపుస్తకంలో చేర్చారు.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

