నయనతార ఇప్పుడు దక్షిణాది నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. తమ సినిమాల్లో నయన కనిపించాలంటే..కోట్లకు కోట్లు గుమ్మరించేయాల్సిందే.! అవును…వయసు పెరిగేకొద్దీ..నయన రెమ్యూనరేషన్ పెరిగిపోతోంది.
హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా దక్షిణాదిలో దూసుకుపోతున్నఈ అమ్మడు అగ్ర హీరోల సరసన నటిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో దుమ్ము రేపుతోంది. ఆమె నటించిన డోరా, వాసుకి చిత్రాలు దక్షిణాదిలో మంచి సక్సెస్ సాధించాయి.
తాజాగా ఓ వ్యాపార ప్రకటన కోసం ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. అదీ ఓ సినిమాకు కాకుండా వ్యాపార ప్రకటనకు కోసం భారీ మొత్తాన్ని తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల నయనతార ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ వ్యాపార ప్రకటన నిడివి సుమారు 50 సెకన్లు మాత్రమే.
ఈ వ్యాపార ప్రకటన కోసం కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్‌కు వెళ్లిందట నయన. అయితే ఆ ప్రకటన కోసం ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం రూ.5 కోట్లు. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఫిలింవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇదిలా ఉంటే..ఇటీవల తెలుగులో నటించిన ఓ చిత్ర ప్రమోషన్‌కు రావాలని సదరు నిర్మాత నయనతారను కోరారట. అయితే రూ.30 లక్షలు ఇస్తే తాను ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పే సరికి నిర్మాతకు దిమ్మతిరిగిందట. చేసేదేమీ లేక హీరోతోనే సరిపెట్టుకోవాలనుకొన్నాడు.
కానీ ఓ వివాదం కారణంగా ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయిందనుకోండి అది వేరే విషయం. మొత్తానికి నయనను టచ్ చేయాలంటే…అడిగిన రెమ్యూనరేషన్‌ని ఇవ్వాల్సిందే. చూడాలి మరి నయన డిమాండ్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో.