నందమూరి హరికృష్ణ అకాలమరణం చెంది నందమూరి కుటుంబాన్ని, నందమూరి అభిమానులను శోక సముద్రం లో ముంచివేసారు. అందరినీ నవ్వుతూ పలకరించి, చతురతను ప్రదర్శించి ఎదుటి వారి నవ్వును కోరుకునేలా మాట్లాడే ఆయన, తన కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఆత్మీయంగా పాల్గొనేవారు. తన తనయుల సినిమాలకి సంబంధించిన వేడుకలకి కూడా తప్పనిసరిగా హాజరయ్యేవారు హరికృష్ణ.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన హరికృష్ణ ‘‘నా పెద్ద బిడ్డ పేరు జానకిరామ్. రెండో బిడ్డ కల్యాణ్‌రామ్. ఈ రెండు పేర్లూ మా నాన్న పెట్టినవే. మేం మగ సంతానంగా ఏడుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఏడుగురికీ కృష్ణ అని వచ్చేలా పేరు పెట్టారు. మాకు నలుగురు అక్కా చెల్లెళ్లు. వాళ్లందరికీ ఈశ్వరి అని వచ్చేలా పేరు పెట్టారు. నా పెద్ద కొడుకులిద్దరి పేర్లూ రామ్‌లే కాబట్టి, జూనియర్ బాబు (ఎన్టీఆర్)కి నేనే తారక రామ్ అని పేరు పెట్టా.
‘విశ్వామిత్ర’ చిత్రీకరణకి ముందు ‘ఏం చేస్తున్నాడు మీ మూడోవాడు? తీసుకురా’ అన్నారు నాన్న. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని పైనుంచి కిందకి చూసి బాగానే ఉన్నాడు, వెరీ గుడ్ అంటూ ‘నీది నా అంశ, నీకు నా పేరు ఉండాలి’ అంటూ నందమూరి తారక రామారావు అని పెట్టారు. అలా ఆయన పేరును ఆయనే దానం చేశానంటూ తన తండ్రి ఔన్నత్యాన్ని తెలిపారు హరికృష్ణ.